Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శతాబ్దాల కిందటి చారిత్రక కట్టడం... తిరుమల ప్రజలతోనూ, భక్తులతోనూ పెంచుకున్న అనుబంధాన్ని టిటిడి అధికారులు కూలగొట్టారు. భక్తులు, ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా టీటీడీ వ్యవహరిస్తున్న తీరుకు మరో ఉదాహరణ ఈ కూల్చివేత. టిటిడి తీరును సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ఓ తీవ్రంగా ఖండించారు. శ్రీకృష్ణదేవరాయలు హయాంలో శతాబ్దాల కిందట నిర్మించిన పార్వేటి మండపాన్ని టీటీడీ అధికారులు ఏకపక్షంగా కూల్చివేయటం అసమంజసమైన చర్యగా కందారపు మురళి అభివర్ణించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన స్థలం ఉండగా, పార్వేటి మండపాన్ని కూలగొట్టడం ఏరకంగా సమర్ధనీయమో టీటీడీ యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని టిటిడి యాజమాన్యం తేలిగ్గా తీసుకొని కూల్చివేయడం అన్యాయమన్నారు. తిరుమల కొండపై అన్నమయ్య నివాసం ఉన్న ఇంటిని ఆయన పూజలు చేసిన మండపాన్ని కూల్చివేసి టిటిడి అధికారులు తప్పు చేశారని, వాటి పునర్నిర్మాణం జరగాలని, పోరాటం జరుగుతున్న సమయంలో మరో అన్నమయ్య గురుతుని చెరిపి వేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. తక్షణం టిటిడి యాజమాన్యం ఇలాంటి తప్పుడు వైఖరులను మానుకోవాలని ప్రస్తుత స్థానంలోనే పార్వేటి మండపాన్ని కొనసాగించాలని కందారపు మురళి డిమాండ్ చేశారు
Admin
Famous TV