Famous TV - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా : ప్రజలందరికీ వంద శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అందించడమే లక్ష్యంగా, అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమం, సేవలు అందలేదనే పరిస్థితి ఉండరాదనే లక్ష్యంతో సీఎం జగన్ "జగనన్న సురక్ష" ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిందని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్ కుమార్ లతో కలిసి పెనమలూరు మండలంలోని పెదపులిపాకలో 224, ఉయ్యూరు మండలం ఆకునూరులో 247, తోట్లవల్లూరు మండలం గరికపర్రులో 207, పామర్రు మండలం జుజ్జువరం గ్రామంలో 361 మంది ప్రజలు వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా జగనన్న సురక్ష కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని వారందరికీ వివిధ సభల్లో తన స్వహస్తాలు మీదుగా రేషన్ కార్డులు, ఆదాయ, కుల, జనన, మరణ, వివాహ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ, ప్రజల ఇంటి వద్దకే వెళ్లి, వారికి ఏం కావాలో తెలుసుకుని, ఏ ఒక్క పేదవాడు కూడా చిన్నచిన్న సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందించడమే లక్ష్యంగా సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు జగనన్న సురక్ష శిబిరాలు ఏర్పాటు కాబడిందన్నారు. ముందుగా వాలంటీర్లు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి ఏమైనా సర్టిఫికెట్లు కావాలా, ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా తెలుసుకొని, సచివాలయాల్లో తెలిపి పరిష్కరించి జగనన్న సురక్ష శిబిరాల్లో అందిస్తారని చెప్పారు. ఏ ఒక్క కారణంతో కూడా అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని, ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, వెంటనే పరిష్కార మార్గం చూపుతారన్నారు.పలు కుటుంబాల్లో తల్లిదండ్రులు మాత్రం సొంత గ్రామాల్లో ఉంటున్నారని, పిల్లలు ఉద్యోగాలరీత్యా ఎక్కడెక్కడో ఉంటున్నారని, కానీ వారి పిల్లల ఉద్యోగాల వలన తల్లిదండ్రులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని, అలాంటి కుటుంబాలను సైతం గుర్తించి కార్డులను విభజించి వారికి కూడా సంక్షేమ పథకాలను అందించేలా జగనన్న సురక్ష కార్యక్రమంలో శ్రీకారం చుట్టామన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం నెల రోజులుపాటు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగానని, నాడు పరిస్థితులు అంత అద్వానంగా ఉండేవని ఈ సందర్భంగా కలెక్టర్ పి. రాజాబాబు తన స్వీయ అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. అర్హత కలిగి ఏ ఒక్కరూ కూడా సంక్షేమ పథకాలు పొందకుండా ఉండకూడదని, అర్హులందరికీ సమగ్రంగా, సంపూర్ణంగా సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అని అన్నారు. 2019 లో స్పందన కార్యక్రమం రాష్ట్రంలో మొదలైందని, ఆ కార్యక్రమంలో ఏదైనా సమస్య పరిష్కారం కోరుతూ అర్జీదారుడు దరఖాస్తు చేసుకుంటాడని, అయితే నిర్దేశించిన కాల వ్యవధిలో పరిష్కరించాలని, పలు సందర్భాల్లో కొన్ని పిటిషన్లు రెండు మూడు శాఖల పరిధిలో ఉండడం వలన ఆ సమస్య నివారించబడడంలో కొంత జాప్యం ఏర్పడుతుందన్నారు. ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి స్పందన కంటే మెరుగ్గా ఉండేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించారన్నారు అర్హత ఉన్నా పథకాలు అందని వాళ్లు, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైన వాళ్లకు మెరుగైన పరిష్కారం చూపేందుకే ఈ కార్యక్రమం మొదలైందన్నారు. కలెక్టర్ల నుంచి కమిషనర్ల వరకు, సచివాలయాల దాకా అందరినీ భాగస్వాముల్ని చేస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలు కావడం విశేషం అన్నారు. లిఖితపూర్వకంగా, మౌకికంగా 1902 టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ ద్వారా వ్యక్తిగత సమస్యల పరిష్కారం చేస్తూ ఆ ప్రోగ్రాం ఒక మంచి వేదిక అయిందన్నారు ఎక్కడా పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు నేరుగా ఫోన్ చేయాలని ప్రభుత్వం కోరడం పారదర్శక పాలనకు ఒక చక్కని ఉదాహరణని కలెక్టర్ అన్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలని దృక్పథంతో జగనన్న సురక్ష పథకం ఇటీవల ప్రవేశపెట్టారన్నారు. కొన్ని సర్వీసులు మిగిలిపోవడంతో వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలోని 13 రకాల సేవలను పరిశీలించిన వారం రోజుల్లోనే ఆయా ధ్రువపత్రాలు నేరుగా దరఖాస్తుదారునికి నేరుగా అందించడం ఒక విప్లవాత్మకమైన సంస్కరణ అని కలెక్టర్ పి. రాజాబాబు ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో మాట్లాడుతూ, పేదల పట్ల కనికరం, తన దృష్టికి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని తపించే ఒక సమర్థవంతమైన కలెక్టర్ కృష్ణాజిల్లాకు రావడం మన అదృష్టం అని కొనియాడారు.ఆకునూరు గ్రామంలో దళితులు స్మశాన భూమికి ఎంతోకాలంగా ఇబ్బంది పడుతున్నారని, అలాగే అక్కడికి వెళ్ళేందుకు వీలుగా ఒక రహదారిని ఏర్పాటు చేయాలని కోరారు. తర్వాత పామర్రు శాసనసభ్యులు అనిల్ కుమార్ గరికపర్రు, జుజ్జువరం గ్రామాల్లో మాట్లాడుతూ, సమర్థవంతమైన వ్యక్తి మన జిల్లాకు కలెక్టరుగా రావడం మన అదృష్టమని చెప్పారు. ఆయన ప్రతి సమస్యకు కూడా ఆలోచించి వెంటనే పరిష్కారం మార్గం చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో పెదపులిపాక గ్రామ సర్పంచ్ గుంటూరు శ్రీనివాస్ చౌదరి, ఆకునూరు గ్రామ సర్పంచ్ వసంత కుమార్, గరికిపర్రు సర్పంచ్ వీరంకి రమాదేవి, కొమ్మూరి గ్రామ సర్పంచ్ బొమ్మరెడ్డి వెంకటేశ్వరరావు, జుజ్జువరపు గ్రామ సర్పంచ్ పుట్టి పున్నమ్మ, ఉయ్యూరు, పామర్రు జడ్పిటిసి కూనపురెడ్డి స్వరూపారాణి, ఎంపీపీ దాసరి అశోక్ కుమార్, ఉయ్యూరు ఆర్డీవో ఎన్. విజయ్ కుమార్, తాహసిల్దార్ మస్తాన్ రావు, ఎంపీడీవో ఉమాదేవి, డి ఎల్ డి ఓ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV