Famous TV - భక్తి / తిరుపతి : శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన సోమవారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పరమపద వైకుంఠ నాధుడి అలంకరణలో భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారు స్వయంగా పాల్గొనే మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఆది శేషుడు ఏడుకొండలకు, ఏడు లోకాలకు సంకేతంగా ఏడు పడగలు కలిగిన అతి శక్తిమంతుడైనప్పటికీ శ్రీవారికి వాహనమై నిత్యం స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ అవడంతో శేషశాయి కూడా పిలుస్తారు. శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్న శేషునిపై దర్శించే భక్తుల్ని స్వామి వారు కటాక్షిస్తారని ప్రతీతి. భక్తులు అందరూ ఆది శేషుని వలె స్వామికి నిత్య సేవకులుగా ఉంటే సత్ఫలితాలు పొందవచ్చని ఈ వాహనసేవ ద్వారా స్వామి వారు భక్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీతో పాటు ఆలయ ఈవో సుబ్రమణ్యం రెడ్డి, ఆలయ కంకణ భట్టార్ గిరిధర్ భట్ట ఆచార్యులు, వేద పాఠశాల ప్రన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. *శ్రీవారికి సారె సమర్పణ* తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పాకాల మండలం మొగరాల, దామలచెరువు, గానుగపెంట, ఉప్పరపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు చీర, సారెను తీసుకు రావడంతో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎదురెళ్ళి స్వాగతం పలికారు. అనంతరం భక్తులు తీసుకుని వచ్చిన సారెను స్వామి వారికి సమర్పించారు. *అకట్టుకున్న కేరళ వాయిద్యాలు* శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున కేరళ వాయిద్యాలు, చెక్క భజనలు, పిళ్లన గ్రోవి కళాకారుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు, శివపార్వతుల కళారూపాలతో చిన్నారులు ఎంతగానో ఆకట్టుకున్నారు.
Admin
Famous TV